వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రమైంది. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

తిరుమల, మే 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో పాటు వారాంతం కావడంతో శుక్రవారం ఉదయం నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ నుంచి రింగురోడ్డులోని శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వీరికి 16 గంటల దర్శన సమయం పడుతోంది.
ఇక, టైంస్లాట్ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకూ మూడు నుంచి నాలుగు గంటల తర్వాత దర్శనం లభిస్తోంది. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో శ్రీవారి ఆలయం ప్రాంతం, మాడవీధులు, గదులు కేటాయించే కార్యాలయాలు, సీఆర్వో, ఆర్టీసీ బస్టాండ్, అన్నప్రసాద కేంద్రం, అఖిలాండం, లడ్డూ కాంప్లెక్స్, లేపాక్షి, రాంభగీచ కూడళ్లు భక్తులతో కిటకిటాలడుతున్నాయి.
గదులు లభించని భక్తులు కార్యాలయం ముందు, యాత్రికుల వసతి సముదాయాలు, చెట్ల కింద, ఫుట్‌పాత్‌లపైనే సేదతీరుతున్నారు. ఇక, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా మారాయి. తిరుమలలో సందర్శనీయ ప్రదేశాలైన శ్రీవారి పాదాలు, పాప వినాశనం కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. శని, ఆదివారాలు కూడా ఇదే తరహాలో రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.