NITI Aayog Meeting: ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం జరుగనుంది.
న్యూఢిల్లీ, మే 24: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) , రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) బిజీబిజీగా ఉన్నారు. ఈరోజు (శనివారం) ప్రగతి మైదానం భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి (NITI Aayog Governing Council Meeting) ఇరువురు సీఎంలు హాజరుకానున్నారు.
సాయంత్రం 4 గంటల వరకు నీతి ఆయోగ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను తెలంగాణ సీఎం రేవంత్ ఆవిష్కరించనుండగా.. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా పెంపుదల తదితర అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
2018 తర్వాత తొలిసారిగా
ఇక.. 2018 తర్వాత తొలిసారిగా నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా నీతిఆయోగ్ పాలక మండలి భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు.
2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదల్చుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదికను సీఎం రేవంత్ సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్‌తో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించనున్నారు.
తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడం లక్ష్యంగా పెట్టకున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పనున్నారు. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్‌తో పాటు ఆ రంగాల్లో మరింత ముందుకు పోయేందుకు ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలంగాణ సీఎం వివరించనున్నారు.
ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్‌లుగా మారుస్తూ మౌలిక వసతులు, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో యూనివర్సిటీల ఏర్పాటుపై తన ప్రసంగంలో సీఎం ప్రస్తావిస్తారు.
సాగు రంగం అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్న బియ్యం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే సిలిండర్ సరఫరాలను వివరించనున్నారు.
సామాజిక సాధికారితలో భాగంగా ఎస్సీ కులాల ఉప వర్గీకరణ, కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానించిన విషయాన్ని కూడా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు.
ఏపీ సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
అదే తరహాలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన సంస్కరణలు, జనాభా నిష్పత్తిలో వ్యత్యాసాల తగ్గింపు, జనాభా పెంపుదలపై, నదుల అనుసంధానం నీటి వినియోగంపై ఈ సమావేశంలో సీఎం ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఒక్కో సీఎంకు 7 నిముషాలు సమయాని నీతి ఆయోగ్ కేటాయించింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
సమావేశానికి ముందు
నీతి ఆయోగ్ పాలక మండలి భేటీ ప్రారంభానికి ముందు సీఎంలు, గవర్నర్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ముచ్చటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రారంభోపన్యాసం చేయనున్నారు.