హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు సవరించబడ్డాయి. ఆ టికెట్ చార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తున్నాయి. తొలుత ఈనెల 17నుంచి ఇవి అమలులోకి తీసుకొస్తామని మెట్రో రైల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే..
ప్రయాణికులు, వామపక్ష పార్టీల నాయకుల నిరసనల నేపథ్యంలో సంస్థ అధికారులు పెంచిన రేట్లపై 10శాతం తగ్గిస్తామని, ఈనెల 24 నుంచి అమలులోకి వస్తుందని యాజమాన్యం ప్రకటించింది.

– సవరించిన మెట్రో టికెట్ల ధరలు నేటినుంచి అమలులోకి
హైదరాబాద్ సిటీ: నగరంలోని మెట్రో రైలు(Metro Rail)లో సవరించిన టికెట్ చార్జీలు శనివారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇటీవల పెంచిన టికెట్ ధరలపై 10 శాతం తగ్గిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రకటించింది.
అయితే, పదిశాతం తగ్గింపును స్లాబులన్నింటిలోనూ చూపించకుండా టికెట్ కొనుగోలు సమయంలో చిల్లర సమస్యను సాకుగా చూపిస్తూ రౌండప్ పేరుతో ప్రయాణికులపై కొంత అదనపు భారాన్ని మోపింది.

ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) సిఫారసుల ఆధారంగా ఎల్‌అండ్‌టీ సంస్థ తొలుత కనిష్టం రూ.2, గరిష్టం రూ.16 వరకు టికెట్ల రేట్లను Aపెంచింది.
ఈనెల 17నుంచి ఇవి అమలులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అయితే, ప్రయాణికులు, వామపక్ష పార్టీల నాయకుల నిరసనల నేపథ్యంలో సంస్థ అధికారులు పెంచిన రేట్లపై 10శాతం తగ్గిస్తామని, ఈనెల 24 (శనివారం) నుంచి అమలులోకి వస్తుందని శుక్రవారం వెల్లడించింది.

10శాతం తగ్గింపు తర్వాత పొందుపరిచిన టికెట్ చార్జీలను అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో కనిష్ఠంగా రూ.11, గరిష్ఠంగా రూ.69 ధరను చూపించారు. ఇటీవల ప్రకటించిన స్లాబుల్లోని రేట్లను తగ్గించామని, ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు.
స్టేషన్లలో ఫిజికల్ టికెట్లతోపాటు క్యూఆర్‌కోడ్, టోకెన్, డిజిటల్, స్మార్ట్‌కార్డులకు కూడా సవరించిన రేట్లపై 10శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థ పదిశాతం రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నా వాస్తవానికి ఇది 7శాతం వరకే ఉన్నట్లు రవాణారంగ నిపుణులు చెబుతున్నారు.
అయితే, టికెట్ల కొనుగోలు సమయంలో చిల్లర సమస్య ఉండకూడదని చెబుతూ కాస్త వడ్డింపులు చేసినట్లు తెలుస్తోంది.